Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 10

"Sumantra tells story of Rishyasrumga (2)"

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

బాలకాండ
పదియవ సర్గ

సుమంత్రశ్చోదితోరాజ్ఞా ప్రోవాచేదం వచః తథా |
యథర్శ్యశృంగస్త్వానీతః శృణు మే మంత్రిభిః సహ ||

తా|| రాజ ప్రోత్సాహముతో సుమంత్రుడు ఇట్లు చెప్పసాగెను. " ఓ రాజా రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుని రప్పించిన రీతిని తెల్పుదను వినుడు"

రోమపాదమువాచేదం సహామాత్యః పురోహితః |
ఉపాయో నిరపాయో అయమ్ అస్మాభిరభిచింతితః ||

తా||'ఆమాత్యులతో గూడియున్న రోమపాదునితో పురోహితుడు ఇట్లు పలికెను. "మేము అలోచించిన ఉపాయము వలన ఎట్టి అపాయము జరుగదు ".

ఋష్యశృంగో వనరచరః తపస్స్వాధ్యాయనే రతః |
అనభిజ్ఞః స నారీణాం విషయాణాం సుఖస్య చ ||
ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్తప్రమాదిభిః |
పురం ఆనాయిష్యామః క్షిప్రం చ అధ్యవసీయతామ్ ||
గణీకాః తత్ర గచ్చంతు రూపవత్యః స్వలంకృతాః |
ప్రలోభ్య వివిధోపాయైః ఆనేష్యంతీహ సత్కృతాః ||

తా|| "ఋష్యశృంగుడు వనమునందు నివసించువాడు.అతడు తపస్సునందు వేదాధ్యయనమందు నిమగ్నుడైవుండును. అతడు సుఖములగురించి స్త్రీవిషయలగురించి జ్ఞానములేనివాడు . మానవుల మనస్సు ఇంద్రియములను ఆకర్షించు విషయముల ద్వారా అయనను పురమునకు శీఘ్రముగా రప్పింతుము. అలంకరించుకున్న రూపవతులైన గణికలను అచటికి పంపుదము. వారు అచటికి వెళ్ళి వివిధోపాయములతో మరియు బహుమానములతో ఆకర్షించి తీసుకువచ్చెదరు".

శ్రుత్వా తథేతి రాజా చ ప్రత్యువాచ పురోహితమ్ |
పురోహితో మంత్రిణశ్చ తథా చక్రుశ్చ తే తదా ||
వారముఖ్యాశ్చ తచ్ఛ్రుత్వా వనం ప్రవివిశుర్మహత్ |
ఆశ్రమస్యావిదూరే అస్మిన్ యత్నం కుర్వంతి దర్శనే ||

తా||" అది విని రాజు పురోహితునితో అట్లే జరుగుగాక అని చెప్పెను. పిమ్మట మంత్రులు పురోహితుడూ ఆవిధముగనే చేసిరి. ఆ ఆదేశములను విని వారాంగనలు ఆ మహావనమున ప్రవేసించిరి. ఆ ఆశ్రమమునకు సమీపముగా చేరి ఋషి దర్శనమునకు ప్రయత్నము చేయసాగిరి".

ఋషిపుత్త్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసినః |
పితుస్స నిత్యసంతుష్టో నాతిచక్రామ చాశ్రమాత్ ||
న తేన జన్మప్రభృతి దృష్టపూర్వం తపస్వినా |
స్త్రీ వా పుమాన్ వా యచ్చాన్యత్ సర్వం నగర రాష్ట్రజమ్ ||

తా|| "ఆ ధీరుడైన ఋష్యశృంగుడు ఏల్లప్పుడూ ఆశ్రమములో నుండువాడు. పితృసేవలో నిమగ్నుడై అతడు ఆఆశ్రమము విడిచి ఎప్పుడూ పోలేదు. ఆ తపస్వి పుట్టినదినమునుంచి స్త్రీలను గాని పురుషులను గాని నగరములకు గ్రామములకు సంబంధించిన మరో ప్రాణులను చూడలేదు".

తతః కదాచిత్ తం దేశమ్ ఆజగామ యదృచ్ఛయా |
విభండకసుతస్తత్ర తాశ్చాపశ్యత్ వరాంగనాః ||
తా శ్చిత్రవేషాః ప్రమదా గాయంత్యోమధుర స్వరాః |
ఋషిపుత్రం ఉపాగమ్య సర్వా వచనమబ్రవన్||
క స్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్ఛామహే వయమ్ |
ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంస నః ||

తా|| " పిమ్మట ఒకనొకప్పుడు ఆ విభండకసుతుడు అనుకోకుండా వారాంగనులు ఉన్న చోటికి వచ్చి ఆ వారాంగనలను చూచెను. చిత్ర విచిత్ర వేషములను ధరించివున్న ఆ వారాంగనలు మధుర స్వరములతో పాడుచూ ఆ ఋషిపుత్రుని సమీపించి ఇట్లు పలికిరి. " ఓ బ్రాహ్మణోత్తమా నీవు ఎవరవు ? ఇచటవుండుటకు కారణమేమి ?ఈ నిర్జనమైన ఘోరారణ్యములో ఓంటరిగా తిరుగుటకు కారణమేమి? మేము వినగోరుచున్నాము".

అదృష్టరూపాః తాః తేన కామ్యరూపా వనేశ్త్రియః |
హార్దాత్ తస్య మతిర్జాతా హ్యాఖ్యాతుం పితరం స్వకమ్ ||
పితా విభండకోsస్మాకం తస్యాహం సుత ఔరసః |
ఋష్యశృంగ ఇతి ఖ్యాతం నామ కర్మ చ మే భువి ||
ఇహాశ్రమపదోsస్మాకం సమీపే శుభదర్శనాః |
కరిష్యే వోsత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకమ్ ||

తా||" ఆ తపస్వి ఇదివరలో ఎప్పుడునూ అట్టి సుందరరూపములుగల వన స్త్రీలను చూడనైవాడై ఆ సంతోషములో తనతండ్రిని గురించి వారితో చెప్పదలచెను." నా తండ్రి బిభండక మహర్షి . నేను ఆయన ఔరస పుత్రుడను. ఋష్యశృంగుడను పేరు గలవాడను. ఈ వనమున తపోజీవనము సుప్రసిద్ధము. ఓ శుభదర్శనులారా ఈ సమీపమునే మా ఆశ్రమము గలదు. అచటికి రండు. అచట విధివిధానముగా మీఅందరినీ పూజింతును".

ఋషిపుత్రవచః శ్రుత్వా సర్వాసాం మతిరాస వై |
తదాశ్రమపదం ద్రష్టుం జగ్ముస్సర్వాశ్చ తేన తాః ||
అగతానాం తతః పూజామ్ ఋషిపుత్రశ్చకార హ |
ఇదమర్ఘ్యమ్ ఇదం పాద్యమ్ ఇదం మూలం ఫలం చ నః ||

తా|| ఆయన వచనములను విని వారందరికిని ఆశ్రమము చూడ కోరిక కలిగెను. అంతట వారు ఆయనతో గూడి ఆ ఆశ్రమమునకు వెళ్ళిరి . ఆ అశ్రమమునకు వచ్చిన ఆరందరికీ అతడు అర్ఘ్యపాదములను కందమూల ఫలములను ఒసగి ఆదరించెను.

ప్రతిగృహ్య చ తాం పూజాం సర్వా ఏవ సముత్సుకాః |
ఋషేర్భీతాశ్చ శీఘ్రం తా గమనాయ మతిం దధుః ||
అస్మాకమపి ముఖ్యాని ఫలానీమాని వై ద్విజ |
గృహేణ ప్రతి భద్రం తే భక్షయస్వ చ మాచిరమ్ ||
తతస్తాః తం సమాలింగ్య సర్వా హర్షసమన్వితాః |
మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ బహూన్ ||

తా|| ఆయన పూజలను స్వీకరించి ఉత్సాహము గలవారైనప్పటికీ విభండకముని అచటికి వచ్చునను భయముతో అచ్చటనుండి వెడలి పోదలిచిరి. "ఓ ద్విజోత్తమా మా యొక్క ముఖ్యమైన ఫలములను స్వీకరింపుడు. నీకు శుభమగును . ఆలసింపక ఆరగించుడు "అని వారందరునూ ఆయనను సంతోషముతో కౌగిలించికొని వివిధరకములైన భక్ష్యములను సమర్పించిరి.

తాని చాస్వాద్య తేజస్వీ ఫలానీతి స్మ మన్యతే |
అనాస్వాదితపూర్వాణి వనే నిత్య నివాసినామ్ ||
అపృచ్ఛ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్యచ |
గచ్ఛంతి స్మాపదేశాత్ తాః భీతాః తస్య పితుః స్త్రియః ||

తా|| ఆ తేజస్వి ఆ ఫలములను భక్షించి ఆ వనములో నివశించువారెవ్వరూ పూర్వము భక్షింపబడని పలములని గ్రహించెను.ఆ గణికలు అతని తండ్రి్ భయముతో , తాము చేయుచున్న వ్రతములగురించి చెప్పి ఆ వ్రతముచేయుటకు పోవలనని కారణముతో వెళ్ళ సాగిరి.

గతాసు తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో ద్విజః |
అస్వస్థ హృదయశ్చాసీత్ దుఃఖం స్మ పరివర్తతే ||
తతో పరేద్యుః తం దేశం ఆజగామ స వీర్యవాన్ |
మనోజ్ఞా యత్ర తా దృష్టా వారముఖ్యాస్స్వలంకృతాః ||
దృష్త్వైవ తా స్తదా విప్రం ఆయాంతం హృష్టమానసాః |
ఉపసృత్య తత స్సర్వాః తా స్తమూచురిదం వచః ||

తా|| వారందరునూ వెళ్ళిపోగా ఆ కాశ్యపాత్ముజుడైన ఆ తపస్వి వ్యాకులచిత్తముతో మిక్కిలి దుఃఖపడెను. పిమ్మట మరుసటి దినమున ఆ తపస్వి ఎచట ఆ అందముగా లంకరిచుకున్న వారాంగనలను చూచెనో ఆ ప్రదేశమునకు వచ్చెను. అటుల వచ్చుచున్న ఆ బ్రాహ్మణకుమారుని చూచి వారు సంతోషముతో పొంగి పోయి ఆయనను సమీపించి ఇట్లు పలికిరి."

ఏహ్యాశ్రమపదం సౌమ్య హ్యాస్మాకమితిచాబ్రువన్ |
తత్రాప్యేషవిధి శ్శ్రీమాన్ విశేషేణ భవిష్యతి ||
శ్రుత్వా తు వచనం తాసాం సర్వాసాం హృదయం గమమ్ |
గమనాయ మతిం చక్రే తం చ నిన్యుస్తదా స్త్రియః ||

తా|| "ఓ మహాత్మా మా ఆశ్రమమునకు విచ్చేయుడు అచట ఇచ్చటి కంటెను ఘనముగా మీకు సత్కారము జరుగును" అని. హృదయము స్పందించు నట్టి వారి మాటలను విని అతడు వారి వెంట పోదలిచెను. ఆ వారాంగనలు ఆయనను తమవెంట తీసుకొని వెళ్ళిరి.

తత్ర చానీయమానేతు తు విప్రే తస్మిన్ మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయంస్తదా ||
వర్షేణైవాగతం విప్రం విషయం స్వం నరాధిపః |
ప్రత్యుద్గమ్య మునిం ప్రహ్వః శిరసా చ మహీమ్ గతః ||
అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై న్యాయతస్సుసమాహితః |
వవ్రే ప్రసాదం విప్రేంద్రాత్ మావిప్రం మన్యురావిశత్ ||

తా|| ఆ మహాత్ముడు అచటికి వచ్చిన క్షణములోనే ఆ దేశములో వరుణదేవుడు లోకమునకు ఆహ్లాదము కలిగించునటుల వర్షములు కురిపించెను. తమ దేశమునకు వర్షము తీసుకువచ్చిన విప్రునకు ఎదిరేగి భువి పై సాగిలపడి శిరస్సుతో అభివాదము చేసెను. ఆ రాజు భక్తి శ్రద్ధలతో ఆ మునికి అర్ఘ్యపాద్యములను సమర్పించి " ఓ మునీశ్వరా వారాంగనలద్వారా ఆకర్షించి మిమ్ములను ఇక్కడికి రప్పించినందుకుఆగ్రహపడక మమ్ము అనుగ్రహింపుడు " అని !

అంతః పురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్వా యథావిధి |
శాంతాం శాంతేన మనసా రాజా హర్షమవాప సః ||
ఏవం స న్యవసత్ తత్ర సర్వకామైః సుపూజితః |
ఋష్యశృంగో మహాతేజా శాంతయా సహ భార్యయా ||

తా|| అంతః పురమున ప్రవేశించి ఆ రాజు మనసా తన కుమార్తె యగు శాంతను అయనికి ఇచ్చి యథావిథముగా వివాహమొనర్చి ఆనంద భరితుడాయెను . మహాతేజోవంతుడగు ఋష్యశృంగుడు గౌరవాదరమునలను అందుకోనుచూ భార్య అయిన శాంతతో కలిసి సర్వసుఖములతో నివసింపసాగెను.

|| ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే దశమసర్గః ||
సమాప్తం ||

||వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమందలి బాలకాండలో పదియవ సర్గ సమాప్తము ||

|| ఓమ్ తత్ సత్ ||


|| om tat sat ||